Venkaiah Naidu: తెలుగులో మాట్లాడని వారు తెలుగు నాయకులు కాదు..! 21 h ago
తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. "అమ్మ భాషను మరిస్తే, అమ్మను మరిచినట్టే" అన్నారు. తెలుగులో మాట్లాడని వారు తెలుగుభాషా నాయకులు కాదన్నారు. మాతృభాషలో మాట్లాడనివారికి ఓటు వేయొద్దని ఆయన సూచించారు.
"రాష్ట్రం బయట ఉన్న వారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగు వారు తమ అమ్మ భాషను మాట్లాడడంలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మాతృభాష వాడకం పెరగాలని, సినిమాల్లో మాటలు పాటలు తెలుగుదనం ఉండాలి.
తెలుగు కోసం పత్రికలు, ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయి. ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మన భాషను ఎవరో కాకుండా మనమే కాపాడుకోవాలి. "భాషను ప్రేమించు ప్రోత్సహించు ఇతరులతో పలికించు" అనే నినాదంతో ముందుకెళ్లాలి అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసివేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండాలని, డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలని చెప్పారు. రెండు నెలల క్రితం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారని గరికపాటి అన్నారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని ఆయనకు తెలిపానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.